Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

కర్మ విమోచనకు రూపనామస్మరణ మార్గము

ప్రపంచంలో నిరుపయోగమైన వస్తువు ఏదీలేదు. అయితే మనకు కొన్ని ఉపయోగాలు మాత్రమే తెలుస్తాయి. మనకళ్ళకు కొద్దిదూరంలో వున్న వస్తువే కనబడుతుంది. మన బుద్ధికి గోచరించేదీ కొంత కొంతనే. మానవుని ప్రయోజనమేమి? అతడెక్కడనుంచి వచ్చాడు? ఎక్కడకు వెడుతున్నాడు? అనే ప్రశ్నలు నేడు ఆధ్యాత్ముల మనస్సులలో మెదలుతున్నాయి. మనకు ముందు అంధకారం. వెనుక అంధకారం. ప్రస్తుతంమాత్రం వెలుగు లాంటి ఈ జన్మ. ప్రతిమానవుడు తోటిమానవుల్ని సోదరభావంతో చూచుకోవాలి. తత్త్వ, చింతన చేస్తూ వుండాలి.

ఏ జన్మలోనో చేసికొన్న మంచిచెడ్డలను మూటకట్టుకొని ఈ జన్మ ఎత్తాం. వాటిని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆ మూట లేకుండా మనం వెళ్ళిపోవాలి. ఇంద్రియాలన్నీ కర్మలను అనుభవించడానికి కోసమూ,కర్మ పొగొట్టుట కోసమూ, ఈ మూట లేకపోతే మనం పరమశివుని సాన్నిధ్యానికి వెళ్ళగలం. మనకు పుణ్యమా వద్దు; పాపమూవద్దు. స్వచ్ఛంగా స్ఫటికంలాగా మనం తయారవ్వాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. అపుడు మనమూ పరమశివుని వలె కాగలం. అపుడే ఆ మూర్తిలో మనకు సాయుజ్యం కాగలసులువు ఏర్పడుతుంది.

కర్మవిమోచనానికి చాలా మార్గాలున్నాయి. అన్నిటికంటే రూపనామస్మరణ సులభం. దానిని ఎవరైనా చేయవచ్చును. పాపపరిహారానికి 'శివ' అనురెండు అక్షరములేమార్గం. శివనామోచ్బారణ త్రికాలములలోనూ చేయాలి. దానిని ఉచ్చరించినవారే కాక విన్నవారుకూడ పవిత్రులౌతారు. అనుష్ఠానం ఉన్నవారూ, లేనివారూ, అందరూ శివ నామోచ్చరణ తప్పక చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చును, విద్యార్థులైనవారు విద్యాలయాలలో కూడ చేసుకోవచ్చు. ముందు మనలోని కల్మషం పోగొట్టుకోవాలి. అది శివనామోచ్చారణ వల్లనే సాధ్యమౌతుంది. ఈ విషయం మనకు అగ్నిప్రవేశం చేస్తూ చెప్పిన దాక్షాయణి మాటల్లో వ్యక్తమౌతుంది.

మరణసమయంలో ఎవరికైనా సత్యమే గోచరిస్తుంది. అందుకే మనవాళ్ళు మరణవాఙ్మూం అని తీసుకొంటారు. శివ అంటే భద్రం, కళ్యాణం, మంగళం, శుభం, అనే అర్థాలున్నాయి. శివుణ్ణి దూషించేవాడు శివేతరుడు. సతీదేవి శివనింద వినలేక ఆత్మాహుతి చేసుకోవడానికి అగ్నిప్రవేశం చేసింది. అపుడు విష్ణువు తనచక్రం అడ్డువేశాడు. ఆమె ఆ చక్రంలో ప్రవేశించింది ఆ పార్వతీదేవియే అమరావతి (క్రౌంచపర్వతం) లోని బాలచాముండేశ్వరి. 'అ' మొదలు 'హ' కారం వరకుగల 50 అక్షరములను చక్రంలో నిక్షేపిస్తారు. ఆ 50 అక్షరములూ పార్వతీదేవి శరీరం. కర్మవిమోచనకు రూపస్మరణ నామస్మరణ మించినది ఏదీలేదు. మనం శంకర భగవత్పాదుల సందేశాన్ని అనుసరించి, 'శివో మే గతిః' అని స్మరిస్తూ ఉంటే శివరక్షణ మనకు తప్పక కలుగుతుంది.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page